ఉదయం వాతావరణం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. ఆ రోజు పేపర్ ఒకసారి తిరగేసాకే మిగతా పనులు చూసుకోవడం నా అలవాటు.
పేపర్‌పై "ఆరుద్ర కార్తె ఆరంభం" అని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ ఉంది. దాని కిందనే "కరణం బలరామయ్య మరణం" అనే వార్త కనిపించింది. అది చూడగానే గుండె ఆగినంత పనైంది. కొంచెం సేపు స్టన్ అయిపోయాను. ఆ తర్వాత తేరుకుని వార్త మొత్తం పూర్తిగా చదవడం మొదలుపెట్టాను.
"దుప్పల్లి గ్రామంలో ముప్పై ఏళ్లుగా ఊరి పిల్లలకు రాత్రి బడి చెప్పిన కరణం బలరామయ్య, చీమలు కుట్టడంతో మరణించారు" అని ఉంది ఆ వార్తలో.
అది చదవగానే ఒక్కసారిగా నా చిన్ననాటి ఊరు కళ్లముందు కదలాడింది. ఎన్నో ఏళ్ల క్రితం మా ఊరికి వచ్చిన తొలి తెలుగు పండితులు ఈ సార్. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వ నిర్ణయం వల్ల త్వరగా రిటైర్మెంట్ తీసుకుని, తన సొంత ఊరికి వెళ్ళిపోకుండా మా ఊర్లోనే ఉండిపోయారు. నాలాంటి వాళ్లెందరినో విద్యావంతులను చేసిన మహానుభావుడాయన. అలాంటి వ్యక్తి ఇలా చీమలు కుట్టి మరణించడం ఏంటి? అని ఆలోచనలో పడ్డాను.
ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ స్క్రీన్ చూస్తే ఊరి నుంచి వెంకన్న చేస్తున్నాడు. సార్ ఇంటికి దగ్గరలోనే వాళ్ల ఇల్లు ఉంటుంది. నా రింగ్ టోన్ 'ఇదే నా పల్లెటూరు' సాంగ్ వస్తోంది.
ఫోన్ ఎత్తగానే, "ఒరేయ్! మన సార్ చనిపోయాడురా. త్వరగా హైదరాబాద్ నుండి వచ్చేయ్. ఇంకా చాలా మందికి చెప్పాలి" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వెంకన్న.
వెంటనే నేను, రాము కలిసి బస్సులో ఊరికి బయలుదేరాం. ప్రయాణమంతా సార్‌తో గడిపిన క్షణాలే ఆలోచనలుగా ముసురుకున్నాయి.
రాము అన్నాడు, "సార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కదా?" అని.
నేను అవునంటూ తలూపాను.
"ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. కూతురు చాలా తెలివైనది, లండన్‌లో ఉంటుంది. అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ అంట" అని గుర్తుచేసుకున్నాం.
సార్ గత పదేళ్లుగా, మేడం కాలం చేసిన నాటి నుండి ఆ ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు.
సార్ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు: పుట్టినప్పుడు తల్లిదండ్రులే సర్వస్వమని, పిల్లలుగా ఎదిగే క్రమంలో స్నేహితులే లోకమని, ఆ తర్వాత ప్రియురాలు లేదా భార్యే సర్వస్వమని, ఆపై పిల్లలు, ఇల్లే ప్రపంచమనుకుంటూ మనిషి జీవిస్తాడు. కానీ, చివరకు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలోకి ఒకరిగా వచ్చి, ఒక్కడిగా పోవడమే జీవిత పరమార్థం. అది సార్ విషయంలో నిజమైంది."
"సార్ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు: పుట్టినప్పుడు తల్లిదండ్రులే సర్వస్వమని, పిల్లలుగా ఎదిగే క్రమంలో స్నేహితులే లోకమని, ఆ తర్వాత ప్రియురాలు లేదా భార్యే సర్వస్వమని, ఆపై పిల్లలు, ఇల్లే ప్రపంచమనుకుంటూ మనిషి జీవిస్తాడు. కానీ, చివరకు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలోకి ఒకరిగా వచ్చి, ఒక్కడిగా పోవడమే జీవిత పరమార్థం. అది సార్ విషయంలో నిజమైంది."
మేము సాయంత్రానికి ఊరు చేరుకున్నాము. ఇంకొంతమంది మిత్రులతో కలిసి సార్‌ను చూశాం. రాత్రంతా అక్కడే యక్షగానాలు చూస్తూ గడిపాము. మరుసటి రోజు సాయంత్రానికల్లా సార్ వాళ్ళ పిల్లలు వచ్చారు. ఆ తర్వాత ఎంతో ఘనంగా, ఊరేగింపుగా సార్ అంతిమ యాత్ర జరిగింది.
కానీ, ఊరంతా ఒకటే మాట అనుకుంటున్నారు... "చివరి రోజుల్లో ఒంటరిగా ఉంటూ, ఒంటికి చీమలు పట్టి చనిపోయాడు; ఆ పాపం వాళ్ళ పిల్లలకే తగులుతుంది" అని.
మూడవ రోజు పిట్టకు అన్నం పెట్టే సమయం (చిన్నకర్మ). ఇల్లంతా హడావిడిగా ఉంది. పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని నేను, రాము కలిసి లోపలికి వెళ్ళాము. సార్ కూతురు జ్యోతక్క మమ్మల్ని చూసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత లోపలి గదిని చూపిస్తూ...
"సార్ రోజు పడుకునే ఆ కట్టెల మంచం, దానిపై మెత్తగా ఉండే ఆ రెండు దుప్పట్లు, పక్కనే చెదలు పట్టిన ఆ పాత భగవద్గీత పుస్తకం ఉన్నాయి కదా... వాటిని కాస్త బయటకు తీసుకురండి తమ్ముడూ" అన్నది అక్క.
సరేనని మేము వాటిని బయటకు తీసుకువచ్చి, ఆ దుప్పట్లను గట్టిగా దులిపాము. అంతే... వాటి మధ్యలో నుండి రెండు పెద్ద తేళ్ళు టపటపా కింద పడ్డాయి!
అవి చూడగానే మా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అప్పుడు అర్థమైంది... సార్ చీమలు కుట్టి చనిపోలేదు! అది వర్షాకాలం కావడం వల్ల, పక్కనే ఉన్న దుక్కి దున్నిన పొలం నుండి ఆ తేళ్ళు ఎలా వచ్చాయో ఏమో కానీ, దుప్పట్లలో చేరాయి. ఆ రాత్రి సార్‌ను అవే కరిచి ప్రాణం తీశాయి!
అయ్యో సార్! చనిపోయే ముందు ఆ కటిక చీకట్లో, ఆ నిర్జన గదిలో ఆ తేళ్ళు కుడుతుంటే ఎంత నరకయాతన అనుభవించారో కదా! ఆ నిస్సహాయ స్థితిలో ఎవరిని పిలవలేక, ఆ నొప్పిని భరించలేక ఎంత విలవిలలాడిపోయారో! ఊరి వాళ్ళేమో పిల్లలను నిందిస్తున్నారు, కానీ సార్‌కు రాసిపెట్టి ఉన్న ఆ ఘోర విధిని ఎవరూ మార్చలేకపోయారు. చివరి క్షణంలో ఆ భగవద్గీత సాక్షిగా ఎంత ఘోరమైన మరణాన్ని పొందారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది.
వెల్మజాల నర్సింహ 17.06.26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి